This Blog contains bhakti samkirtanas and kirtanas in different views..
Wednesday, 19 January 2011
GODA GITAMULU
రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ బాణీ: నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాస శర్మ
పల్లవి:
మంగళవధువై గోదాదేవి పల్లకి యెక్కెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!
చరణం 1:
కురులతో పూవులకొండెను చుట్టి నుదుటను కళ్యాణతిలకము దిద్ది
భుజమున పలుకుల చిక్లుకను దాల్చి కులుకుల చెలియలు తన వెంట రాగా
చరణం 2:
నీలాల కన్నుల వజ్రాల కాంతులు, కెంపుల చెక్కిళ్ళు, పగడపు పెదవులు
పచ్చల అంచుల పట్టు వస్త్రాలు - బంగరు తనువుకు నవరత్న సిరులు
చరణం 3:
కోవెలలో కొలువైన శ్రీరంగనాథుని కోరి వచ్చిన ముగ్ధ గోదాదేవి
మనసు యిచ్చెనా, మాల వేసెనా, తానే పూమాలగ మాఱిపోయెనా!
చరణం 4:
సరసుడౌ శ్రీరంగనాథుని సరసన పూవుల ఊయల ఊగిన వేళ
మమతల మాలలు గళమున వేసి పరిణయమాడెను జగదేకవిభుని
ఆఖరి పల్లవి:
మంగళవధువౌ గోదాదేవి పరిణయమాడెనులే
రంగనాథుని ప్రణయదేవియై దేవేరిగ నిలిచెనులే!
*
రచన: నల్లాన్ చక్రవర్తుల చంద్రకళ
పల్లవి:
మధురమధురమీ గోదాచరితం
ముగ్ధహృదయమే వధువైన వైనం
చరణం 1:
తులసీవనముల పావనత్వమే విష్ణుచిత్తుని తనయగ మాఱె -
తాను దాల్చిన పూలమాలనే ప్రణయలేఖగా రంగనికంపె
చరణం 2:
పరమపవిత్ర పూజావిధిని పాశురములలో వివరించినది
భక్తసులభుడౌ శ్రీరంగవిభునితో “అద్వైతము”నే ఆశించినది
చరణం 3:
మార్గశిరాన మంచువానలో తొలిఝాములలో జలకములాడి
వైకుంఠపతియౌ శ్రీరంగనాథుని వ్రతనిష్ఠలతో మెప్పించినది
చరణం 4:
గోదా భక్తికి ముఱిసిన హరియే దివి నుండి భువికి దిగివచ్చెనులే
అంతరంగమున కొలువైన రంగడు వైభోగముగా వరియించెనులే!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment